బోరుబావులు తదితర నీటి వనరులు ఉన్నచోట మాత్రమే సాగు కొంత ప్రారంభమైంది. అయితే బోరుబావుల కింద సాగుచేసిన రైతులు సైతం కొంత ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం.. వర్షాలు లేకపోవడంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలో కురిసిన ఒకటి, రెండు మోస్తరు వర్షాలకు మెట్ట పొలాల్లో పంటలు వేసిన రైతులు మరింత ఆందోళనలో ఉన్నారు. వర్షాలు లేక కొన్నిచోట్ల విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల విత్తనం నుంచి మొక్క ఆశించిన స్థాయిలో రాలేదు. ఇంకొన్ని చోట్ల మొక్క వచ్చినప్పటికీ వర్షాలు లేక, నీటిని అందివ్వలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తమ్మీద ఈ ఏడాది సాగుపై రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో జూన్ చివరి వారం నాటికి వానాకాలం సాగు అంచనాలో కనీసం 40 నుంచి 50శాతం సాగయ్యేది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఈ వానాకాలంలో 4,35,252 ఎకరాల్లో పంటసాగు అంచనా ఉండగా.. ఇప్పటి వరకు అన్నిరకాల పంటలు కలిపి 82,302 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి.


