రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి, భారీస్థాయిలో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడానికి గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అనుభూతి కలిగేలా మినీ ఎయిర్‌పోర్టులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని నాలుగు రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు రూ.39.82 కోట్లు, జడ్చర్ల స్టేషన్‌కు రూ.36.67 కోట్లు, గద్వాల స్టేషన్‌కు రూ.42.82 కోట్లు, శ్రీబాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ స్టేషన్‌కు రూ.6.7 కోట్లతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆయా రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులు గత నెలలో సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.


