గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీయడంతో పాటు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అంతకు ముందు వైద్యులతో కలెక్టర్ సమావేశమై.. జిల్లా ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలు, మందుల స్టాక్‌పై వాకబు చేశారు. రోజువారీ ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్స్, రెఫరల్ కేసుల రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరత, సిబ్బంది సమస్యలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న మెడికల్ కళాశాల వైద్యుల వివరాలను తెలుసుకున్నారు. కాగా, కలెక్టర్ తనిఖీ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో విధులు నిర్వహించడం కొసమెరుపు.
త్వరలో పోస్టుల భర్తీ..
జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు త్వరలోనే అన్ని పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ కర్ణాటక ప్రజలు సైతం వైద్యసేవలు పొందుతున్నారన్నారు. రోగుల సంఖ్య గణనీయంగా ఉందన్నారు. అత్యవసర కేసుల విషయంలో వీలైనంత వరకు ఇక్కడే సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రెఫరల్ చేయాల్సిన క్రమంలో కచ్చితమైన నివేదికను అందజేయాలన్నారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. ప్రసవాల విషయంలో శస్త్రచికిత్సకు అవకాశం లేకుండా సాధారణ కాన్పు అయ్యేలా చూడాలన్నారు.
శిశువు మృతిపై విచారణ..
జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 10న శిశువు మృతిచెందిన ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. గట్టు మండలం తప్పెట్లమొర్సుకు చెందిన మీనాక్షి రెండో కాన్పు కోసం 9న జిల్లా ఆస్పత్రికి రాగా.. ప్రసవ సమయంలో వైద్యులు అందుబాటులో లేని కారణంగా కాన్పు చేయలేదని.. 10వ తేదీ తెల్లవారుజామున పురిటినొప్పులు అధికం కావడంతో వైద్యులు సిజేరియన్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు తెలియజేశారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే శిశువు ప్రాణాలు దక్కేవని రోధించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హామీ ఇచ్చారు.
జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ
అన్ని వార్డుల్లో తిరిగి వైద్యసేవలపై ఆరా
విధి నిర్వహణలో సిబ్బంది
నిర్లక్ష్యంపై ఆగ్రహం
సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని ఆదేశం


