గద్వాల: లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్న 69 మంది సర్వేయర్లకు బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో లైసెన్స్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల సర్వేకు సంబంధించి సమగ్ర శిక్షణ పూర్తిచేసుకున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్రైవేటు భూములతో పాటు నక్షలేని గ్రామాల్లో సర్వే చేయవచ్చన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సర్వేయర్లకు పారితోషికం చెల్లించనున్నట్లు తెలిపారు. భూముల సర్వే కోసం దరఖాస్తు చేసుకునే పౌరులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలు అనుసరించి సర్వే చేయాలన్నారు. భవిష్యత్‌లో ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణకు కూడా లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భూపాల్‌రెడ్డి, జిల్లా సర్వే అధికారి నూకరాజు, డీఈ గోవిందు పాల్గొన్నారు.
నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శిక్షణ తరగతులకు సర్పంచులు, కౌన్సిలర్లు విధిగా హాజరు కావాలని కోరారు.
పడిపోయిన ఉల్లి ధరలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు సుమారు 6 వేల బస్తాలలో ఉల్లిని అమ్మకానికి తీసుకురావడంతో యార్డు మొత్తం ఉల్లి కుప్పలతో నిండిపోయింది. ఈ వారం వేలంలో ఉల్లి ధరలు బాగా పడిపోయాయి. క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.900 వరకు ధర పలికింది. ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలామంది తెచ్చిన ఉల్లిని తిరిగి తీసుకుపోలేక వచ్చిన ధరలకే విక్రయించారు. స్థానిక వ్యాపారులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొని ఉల్లిని కొనుగోలు చేశారు. మార్కెట్ వ్యాపారులు 50 కిలోల బస్తాలుగా తూకం వేసి గరిష్టంగా రూ.600, కనిష్టంగా రూ.450 చొప్పున విక్రయించారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ఎర్రవల్లి: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి, మునుగాల ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్‌ఎన్, ఎఫ్‌ఎల్‌ఎస్ రికార్డులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. అదే విధంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను డీఈఓ స్వయంగా పరిశీలించారు. రోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కూరగాయలు, ఆకుకూరల వద్ద వంట సిబ్బంది తప్పనిసరిగా శుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి.. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని సూచించారు. డీఈఓ వెంట ఎంఈఓలు అమీర్ పాషా, వెంకటేశ్వర్లు ఉన్నారు.


