వ్యూహాలకు పదును
మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు
గద్వాల: మున్సిపల్ వార్డులు, చైర్మన్ స్థానాలు ఏ సామాజిక వర్గాలకు కేటాయించారో తేలిపోయింది. ఇక ప్రత్యేక్ష పోరే మిగలడంతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికల వేడి పెరిగింది. మున్సిపాలిటీల్లో తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వార్డుల్లో గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. రిజర్వేషన్ల ప్రక్రియ రొటేషన్ విధానంలో పూర్తికావడం.. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించడం వంటి అంశాలతో గతంలో ఉన్న వార్డులు, మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల పాతవారికే అనుకూలంగా మారగా.. మరికొన్ని చోట్ల ప్రతికూలంగా మారాయి. దీంతో బల్దియా పీఠాలను కై వసం చేసుకునే దిశగా ప్రధానపార్టీలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బరిలో దిగాలనుకునే ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గద్వాలపైనే నేతల దృష్టి..
జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీపైనే ఆయా పార్టీల ప్రధాన నేతలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత దృష్టిసారించారు. ఇక్కడ పార్టీల తరఫున కంటే ప్రధాన నేతలే బల్దియా పీఠాన్ని కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతూ.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. వార్డుల్లో రిజర్వేషన్ల మేరకు తమ బలాలు, బలహీనతలను లెక్కలు వేసుకుంటున్నారు. బలంగా ఉన్న చోట గెలుపు అభ్యర్థుల పలుకుబడిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ పోల్ మ్యానేజ్‌మెంట్ ఎలా చేయాలో చర్చలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి పోటీ తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఓటర్లకు ఏ స్థాయిలో తాయిళాలు వేస్తారో.. లిక్కర్ ఏరులైపారుతుందోనని రాజకీయ వర్గాలు లెక్కలు వేసుకుంటుండటం గమనార్హం.
నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు
జిల్లాలో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ
గద్వాల మున్సిపాలిటీపై ప్రధాన నేతల దృష్టి


