గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలకం
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
● కలెక్టర్ బీఎం సంతోష్
ఎర్రవల్లి: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్‌లో జిల్లాలోని సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడుతో పాటు కలెక్టర్ హాజరై మాట్లాడారు. సర్పంచులు అధికారులతో సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అన్ని నియమాలు, విధులు, బడ్జెట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ పథకాల వినియోగం, అధికారుల సంప్రదింపు విధానం వంటి అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. సర్పంచుల సహకారంతో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రాథమిక విద్యకు బలమైన పునాదులుగా మార్చాలన్నారు. నీతి అయోగ్‌లో గట్టు మండలం వెనుకబడిన ప్రాంతంగా ఉన్నప్పటికీ.. చిత్తశుద్ధితో పనిచేసి రూ.కోటి నగదు బహుమతి సాధించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సర్పంచులదేనని అన్నారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రతి వారం సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
● ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టామని.. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సర్పంచులకు సూచించారు.


