పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
మానవపాడు: మండల రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్డీఓ అలివేల అన్నారు. సోమవారం మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.
మహిళా సంఘాలకు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
మానవపాడు: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్వయం సహాయక మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోందని అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి మండలాలకు చెందిన మహిళా సంఘాల బాధ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 40వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం ట్రైనర్ రఘు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో డీపీఎం రుతమ్మ, ఏపీఎంలు భీమన్న, సునంద, మారుతమ్మ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,500
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 440 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,500, కనిష్టంగా రూ. 4,302, సరాసరి రూ. 7,000 ధరలు వచ్చాయి. అదే విధంగా 9 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,062, కనిష్టంగా రూ. 5,802, సరాసరి రూ.6053 ధరలు లభించాయి. 250 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,949, కనిష్టంగా రూ. 5,039, సరాసరి రూ. 6,939 ధరలు వచ్చాయి. 40 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,389, కనిష్టంగా రూ. 1,710, సరాసరి రూ. 2,389 ధరలు లభించాయి.
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి


