పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గద్వాల: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. అనేక పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 147 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆ తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై న తాను అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రధానంగా గద్వాల పట్టణంలోని ప్రతి వార్డులో సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలతో పాటు పార్కులు, సెంట్రల్ లైటింగ్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇందులో గద్వాల పట్టణానికి 515 ఇళ్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇళ్లురాని వాళ్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని... ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్య క్రమంలో నాయకులు జంబు రామన్‌గౌడ్, గడ్డం కృష్ణారెడ్డి, చెన్నయ్య, శ్రీకాంత్, బాబర్ పాల్గొన్నారు.


