కంది కష్టాలు
రైతన్నకు దక్కని మద్దతు ధర
గద్వాల వ్యవసాయం: కంది సాగు చేసిన రైతులు ఈ ఏడాది సైతం నిరాశ చెందుతున్నారు. గడిచిన రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోగా.. ఈసారి కందికి పూత, గింజ దశలో చీడపీడలు ఆశించి పంటపై ప్రభావాన్ని చూపి దిగుబడులు తగ్గాయి. మార్కెట్ యార్డులో క్వింటాల్‌కు నాణ్యతగా ఉంటే రూ.5 వేల నుంచి రూ.7 వేలకు మించడం లేదు. మరోపక్క ప్రభుత్వ పరంగా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఫలితంగా అటు దిగుబడులు రాక.. ఇటు ధరలు గిట్టుబాటు కాక కంది రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.
రాలిన పూత.. తెగుళ్ల బెడద
ఈ ఏడాది గంపెడాశతో నడిగడ్డ రైతులు కంది బాట పట్టారు. మొత్తం 23,484 ఎకరాల్లో పంట సాగు చేయగా.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కొంత ప్రభావాన్ని చూపాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో పూత దశలో మోడాలు, వర్షాలకు పూతలు రాలాయి. గుళ్ల, పచ్చపురుగు విపరీతంగా ఆశించాయి. ఇక గింజ దశలో కాయ తొలుచు, పచ్చ పురుగులు వెంటాడి.. దిగుబడిపై ప్రభావం చూపాయి. వర్షాధారంగా సాగు చేసిన చోట ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంట కోతలు పూర్తి కాగా.. కొన్నిచోట్ల మాత్రమే ఇంకా కోతలు అవుతున్నాయి. వర్షాధారం కింద ఎకరాకు 2 క్వింటాళ్లు, నీటి లభ్యత ఉన్నచోట 3– 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గద్వాల మార్కెట్ యార్డులో వచ్చిన ధరల వివరాలు ఇలా..
నెల అ,వచ్చిన కంది గరిష్టం కనిష్టం సరాసరి
(క్వింటాళ్లు) (రూ.లలో)
డిసెంబర్ 1,476 6,729 2,639 6,613
జనవరి 1,469 7,049 2,400 6,766
(ఇప్పటివరకు)
అ,వచ్చిన కంది : అమ్మకానికి వచ్చిన కంది
మార్కెట్‌లో క్వింటాల్ రూ.7 వేలు మించని వైనం
ఇంకా ప్రారంభం కానిప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
వాతావరణ పరిస్థితులతో తగ్గిన దిగుబడి
రెండేళ్లుగా తప్పని నష్టాలు


