పుర చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉండగా వీటిలో జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగతా 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలు బీసీ వర్గాలకు కేటాయించగా, 9 స్థానాల్లో జనరల్‌కు కేటాయించారు. భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎస్సీ వర్గాలకు చైర్మన్ స్థానాల్లో రిజర్వేషన్ దక్కలేదు. మున్సిపల్ ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు
మరో 4 నెలల పాటు పదవీకాలం..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉండగా, వీటిలో 19 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలను నిర్వహించనున్నారు. జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మే 6 వరకు ఉంది. ఈ రెండు మున్సిపాలిటీలకు ప్రస్తుతానికి ఎన్నికలను నిర్వహించకపోయినప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లను మాత్రం ఖరారు చేసింది. జడ్చర్ల మున్సిపాలిటీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించగా, అచ్చంపేటలో బీసీ మహిళకు కేటాయించారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల సమయంలోనే చేపట్టనున్నారు.
మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్
మహబూబ్‌నగర్ బీసీ మహిళ
(కార్పొరేషన్)
భూత్పూర్ ఎస్టీ జనరల్
అయిజ బీసీ జనరల్
అలంపూర్ బీసీ జనరల్
దేవరకద్ర బీసీ మహిళ
కొల్లాపూర్ బీసీ మహిళ
అచ్చంపేట బీసీ మహిళ
నాగర్‌కర్నూల్ బీసీ జనరల్
మద్దూరు బీసీ జనరల్
కొత్తకోట బీసీ మహిళ
ఆత్మకూర్ బీసీ మహిళ
వడ్డేపల్లి బీసీ జనరల్
గద్వాల జనరల్ మహిళ
జడ్చర్ల జనరల్
కల్వకుర్తి జనరల్ మహిళ
కోస్గి జనరల్
నారాయణపేట జనరల్ మహిళ
మక్తల్ జనరల్
వనపర్తి జనరల్ మహిళ
అమరచింత జనరల్
పెబ్బేర్ జనరల్
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయింపు
భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్
వార్డుల వారీగా రిజర్వేషన్లనుపూర్తి చేసిన ప్రభుత్వం
ముగిసిన మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ
నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం
పట్టణాల్లో ఎన్నికల సందడి..
మున్సిపల్ ఎన్నికలకు వార్డు స్థానాలతో పాటు చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్ల కసరత్తును ప్రభుత్వం పూర్తిచేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పట్టణాల్లో ఎన్నికల వాతావరణం సందడిగా మారింది. ఇప్పటికే రిజర్వేషన్ల అంకం పూర్తికావడంతో నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ సైతం ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఊపందుకున్నాయి. రిజర్వేషన్ల ప్రకటన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.


