బాలికలకు టీకా
● క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు
● జిల్లావ్యాప్తంగా సర్వే,వైద్య సేవలపై కసరత్తు
● 8 వేల మందిని గుర్తించిన అధికారులు
సిబ్బందికి శిక్షణ ఇచ్చాం..
జిల్లావ్యాప్తంగా బాలికలకు టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ సైతం అందించాం. మొదటి విడతగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు వేయనున్నాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. సర్వే నివేదికల ఆధారంగా కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే టీకా వేయడం ప్రారంభిస్తాం. ఈ టీకా వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.
– సంధ్యకిరణ్మయి, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి
గద్వాల క్రైం: జిల్లాలో తొమ్మిదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు క్యాన్సర్ బారినపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే సాధారణంగా మహిళలు ఎక్కువ శాతం గర్భాశయ, నోటి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఇప్పటికే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఈ వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేసేందుకు గద్వాల– అలంపూర్ సెగ్మెంట్‌లలో ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేపట్టి 8,240 మంది బాలికలను గుర్తించి మొదటి విడతగా 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌వీపీ టీకాలు వేయనున్నారు. హెచ్‌వీపీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాధి ప్రధానంగా అవగాహన లేమి, పరిశుభ్రత తక్కువగా ఉండడం సమస్యగా ఉంటుంది.
జిల్లావ్యాప్తంగా సర్వే..
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా సర్వే చేపట్టారు. మొదటి విడతగా 14– 15 సంవత్సరాల బాలికలను గుర్తించారు. ఇందుల్లో 8,240 బాలికలను గుర్తించి 90 రోజులపాటు టీకాలు వేయనున్నారు. ముందస్తుగా టీకాలు ఇచ్చే విధానంపై శిక్షణ అందించారు. గ్రామీణ, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకా వేయనున్నారు. టీకా తీసుకోని వారికి బుధ, శనివారాల్లో ప్రత్యేకంగా టీకా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
నివారణ చర్యలపై దృష్టి..
కిశోర బాలికల విషయంలో హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకి క్యాన్సర్‌కు దారితీస్తుంది. చాలామంది హెచ్‌వీపీ వైరస్ విషయంలో గుర్తించడం నిర్లక్ష్యంగా ఉంటారు. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చర్యలు తీసుకోవచ్చు. లక్షణాలు పొత్తి కడుపు ఉబ్బి నొప్పిగా ఉండటం, అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు ఉంటే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి కట్టడి చేయవచ్చు. మహిళలను బాధిస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. చిన్నారుల భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్‌వీపీ టీకా ఇవ్వనున్నారు.
బాలికలకు టీకా


