భద్రతతో కూడిన విద్యుత్ ప్రతిఒక్కరి బాధ్యత
ఎర్రవల్లి: విద్యుత్ వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విద్యుత్ ఏఈ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమానికి ఆయన హాజరై ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ రవిప్రసాద్‌తో కలిసి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాలు పరిశీలించి శుభ్రం చేశారు. అనంతరం విద్యుత్ వినియోగదారులకు పలు సూచనలు చేశారు. నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ప్రతి ఇంటికి తప్పకుండా ఎర్తింగ్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లు, కూలర్లు ఉన్నవారు ఎర్తింగ్ చేసుకోవడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ప్రజలు తమ ఇళ్లకు నాణ్యమైన సర్వీస్ వైర్లు, డీపీ మెయిన్ స్విచ్ ఫ్యూజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ లైన్లకు నేరుగా కొండీలు వేయకూడదని.. భద్రతతో కూడిన విద్యుత్ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజలకు ఏ రకమైన విద్యుత్ సమస్యలు ఉన్నా వెంటనే స్థానిక సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ నవీన్, లైన్‌మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.


