పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆయా వర్గాల జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాల ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు ఇతర ప్రక్రియ మొత్తం నిర్ధేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్, ప్రిసైడింగ్, ఇతర ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అదే మున్సిపాలిటీకి సంబంధించిన వారు కాకుండా ఇతర మండలాల వారిని తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ డీసీఈఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు జానకీరామ్, ప్రేమ్‌సాగర్, శంకర్‌నాయక్, సైదులు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


