ఇంటింటా సందడి
జిల్లాలో వైభవంగా సంక్రాంతి వేడుకలు
● భోగి మంటలతో
మొదలైన పండగ
● సప్తవర్ణాలతో
శోభిల్లిన లోగిళ్లు
● బంధుమిత్రులతో కళకళ
జిల్లా కేంద్రంలో ఓ ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగవల్లి
గద్వాలటౌన్: ముంగిళ్లలో గొబ్బెమ్మలతో ముచ్చటైన ముగ్గులు.. వెచ్చదనాన్ని అందించే భోగి మంటలు.. గంగిరెద్దుల విన్యాసాల నడుమ బుధవారం సంక్రాంతి సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. జిల్లా అంతటా పిండి వంటల ఘుమఘుమలు.. పతంగుల కోలాహలం నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, మానవపాడు, మల్దకల్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సౌరభాలు వెల్లివిరిశాయి. కాలనీల్లో భోగి మంటలు వేసి పండగ జరుపుకొన్నారు. భోగి మంటల చుట్టూ యువత, చిన్నారులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. సూర్యోదయానికి ముందే మహిళలు లేచి ఇంటి ముందు అలుకు చల్లి.. ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీపడ్డారు. హరివిల్లు రంగులను పులుముకున్న గాలిపటాలతో పిల్లలు ఆనందంగా గడిపారు. పెద్దలను సైతం గాలిపటాలు రంజింప చేశాయి. ప్రతి ఇంటి ముంగిళ్లు రంగవల్లులతో మెరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపించింది. భోగి సందర్భంగా సంప్రదాయ వంటకాలైన సజ్జ, నువ్వుల రొట్టెలు, వాటికి తోడుగా రుచికరమైన కూరలు చేసుకొని కుటుంబ సమేతంగా ఆరగించారు. పండగను పురస్కరించుకొని పలుచోట్ల రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఇంటింటా సందడి
ఇంటింటా సందడి
ఇంటింటా సందడి


