అభివృద్ధి దిశగా పాలమూరు
● ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్‌వి
పచ్చి అబద్ధాలు
● మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి
పట్టం కట్టండి
● రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్‌సాగర్ రోడ్డుకు, డ్యాం డెవలప్‌మెంట్ పనులకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణమ్మ పాల్గొన్నారు.


