డూడూ.. బసవన్న
అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు
● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ
● పండగకు ముందు నుంచే సందడి
● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా
గంగిరెద్దులోళ్లు
డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు.


