రవాణా రంగంపై అక్కసు వెళ్లగక్కడం అన్యాయం
అలంపూర్: రవాణా రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కడం అన్యాయమని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఏదేని వాహనం సిగ్నల్ జంప్ చేసినా.. లేదా చలానా వేసిన వెంటనే యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్టయ్యే పద్ధతి తీసుకొస్తామని సీఎం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అలంపూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రవాణా రంగంపై ఏకపక్ష వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 12వేల జీవనభృతి ఇవ్వాలని.. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని.. సిగ్నల్స్, రోడ్డు క్రాసింగ్‌ల వద్ద తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. 50 కి.మీ.లకు ఒక విశ్రాంతి గది ఏర్పాటు చేయాల్సి ఉండాలని, వాహనాల రద్దీ నియంత్రణకు పోలీసులను నియమించడంతో పాటు రోడ్డు వెడల్పు, స్పీడ్ బ్రేకర్స్, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం.. రవాణా రంగంపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతామన్నా రు. రవాణారంగ కార్మికులు స్వాములు, రాముడు, రాఘవేంద్ర, పరమేశ్, మౌలాలి, మద్దిలేటి, భాస్కర్, మధు, మహేశ్, రామకృష్ణ పాల్గొన్నారు.


