కమనీయం.. గోదా రంగనాథుడి కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో బుధవారం గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో సుప్రభాత సేవ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకం, ప్రభంద పారాయణం, సాత్తుముణై తదితర పూజలు నిర్వహించారు. అనంతరం గోదా రంగనాథస్వామి కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా వల్లూరుకు చెందిన దివంగత నాగేశ్వరెడ్డి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, కల్యాణ మాంగళ్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేడుక నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం కమనీయంగా సాగింది. భక్తులు గోదా రంగనాథుడి కల్యాణాన్ని కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


