‘పుర’ పోరుకు సంసిద్ధం
ప్రాథమిక సమాచారం
సేకరణ పూర్తి ..
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఉద్యోగుల ప్రాథమిక సమాచారాన్ని సేకరించే ప్రక్రియ ముగిసింది. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్‌ఓలు, పీఓలు, సహాయ ఎన్నికల సిబ్బందిగా నియమించేందుకు ఎంతమంది ఉద్యోగులు అవసరమనే విషయంపై స్పష్టత తీసుకొచ్చారు. వీరితో పాటు జోనల్ అఽధికారులు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఎంపిక సైతం పూర్తిచేశారు. వారికి గతంలోనే శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం సిబ్బంది తక్కువగా అవసరం కానుండటంతో చాలా మందికి విధుల కేటాయింపు నుంచి ఉపశమనం కలిగించారు. అత్యధికంగా విద్యాశాఖ అధికారులకే ఎన్నికల బాధ్యతలను కట్టబెట్టనున్నారు.
గద్వాలటౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే వార్డుల వారీగా తుది ఓటరు జాబితా విడుదలచేసిన అధికారులు... ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యదళం కోసం కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల జాబితాను రూపొందించాలన్న ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. అత్యవసర విభాగాలైన వైద్యారోగ్యశాఖ మినహా మిగిలిన శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పలు అంశాలతో కూడిన సమాచారాన్ని రాబడుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది వివరాలను టీపోల్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. ఈ జాబితాలో ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ పొందారా.. సస్పెన్షన్‌కు గురయ్యారా అనే సమాచారం సేకరించి.. వారి వివరాలను తొలగిస్తున్నారు. అత్యధికంగా విద్యాశాఖ సిబ్బందిపైనే దృష్టి సారించారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాలుగు చోట్ల ఎన్నికల నిర్వహణకు ప్రాథమికంగా సుమారు 700 మంది అధికారులు, సిబ్బంది అవసరం ఉన్నట్లు గుర్తించారు. వీరందరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఏదైనా కారణాలతో విధులకు హాజరు కాకుంటే.. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 20 శాతం సిబ్బందిని అదనంగా నియమిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సిబ్బంది వివరాల నమోదు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
సమగ్ర సమాచారం..
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాస్థాయి అధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల వివరాలు ముందుగానే నమోదు కావడంతో గుర్తింపు ప్రక్రియ సులువుగా మారింది. ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించేందుకు స్థానికంగా నివాసం ఉండరాదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. స్థానికత ఆధారంగా విధులు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఉద్యోగుల జన్మస్థలం వివరాలు తప్పనిసరి కానున్నాయి.
జిల్లాలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఇలా..
శాఖల వారీగా ఉద్యోగుల నియామకానికి కసరత్తు
ఎన్నికల విధులు బాధ్యతగానిర్వర్తించేలా చర్యలు
అత్యవసర శాఖల సిబ్బందికి మినహాయింపు


