మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఉండవెల్లి: ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపరాదని ఏఎస్పీ శంకర్ అన్నారు. మంగళవారం ఉండవెల్లి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, అజాగ్రత్త కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమా దాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ రవిబాబు, ఎస్‌ఐ శేఖర్, సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు.
పశువులకు టీకాలు తప్పనిసరి
కేటీదొడ్డి: పశువులకు తప్పనిసరిగా వ్యాధినిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి శివానందస్వామి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో మంగళవారం గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంపదతో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. చూడి కట్టని పశువులతో పాటు సకాలంలో ఎదకు రాని పశువులకు సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. కాగా, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో 20 ఆవులు, 15 గేదెలకు గర్భకోశ చికిత్సలు అందించారు. మరో 15 పశువులకు సాధారణ చికిత్స చేశారు. డా.వినయ్, రమేశ్, వెంకట్రాజీ, ప్రియాంక, నవీన్ చంద్ర, అర్పిత, యామిని, ఉష, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా
ధనుర్మాస ఉత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సుప్రభాత సేవ, పుణ్యహవచనం, పంచామృత అభిషేకం, తీర్థగోష్టి, ప్రభంద పారాయణం వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం భోగి సందర్భంగా గోదా రంగనాథస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ వేడుక కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
మద్యం తాగి వాహనాలు నడపొద్దు


