గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
అలంపూర్: ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ కృష్ణయ్య అన్నారు. మంగళవారం అలంపూర్‌లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించి.. మండల స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 28 నుంచి 31వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. 10 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. కాగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ అలంపూర్ నుంచి అలంపూర్ చౌరస్తా వరకు కొనసాగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి తోట శ్రీనివాసులు, కరాటే శ్రీహరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసన్న, ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్, స్టేడియం అసిస్టెంట్ బషీర్ అహ్మద్, రిటైర్డ్ టీచర్ వెంకట్రామయ్య శెట్టి, భరత్‌కుమార్, నాగరాజు, ఈశ్వర్, నాగరాజు పాల్గొన్నారు.


