క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యం
గద్వాలటౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగ్‌రావు, ఏఎస్పీ శంకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఔత్సాహిక క్రీడాకారులకు సీఎం కప్ గొప్ప అవకాశమని, జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. చీకట్లో ఏదైనా వస్తువును వెతికేందుకు టార్చ్ లైట్లు ఎలా వినియోగిస్తామో.. అలాగే ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు ఈ టార్చ్ ర్యాలీ దోహదపడుతుందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని ఆటలు ఆడేందుకు కేటాయించాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్‌సాగర్, డీవైఎస్‌ఓ కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 72 ఫిర్యాదులు
గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అదనపు కలెక్టర్‌కు నేరుగా వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై మొత్తం 72 ఫిర్యాదులు అందాయని, వాటిని పెండింగులో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్‌డీసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


