జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబదేవి వార్శిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు ఈఓ దీప్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23 వరకు జోగుళాంబ అమ్మవారి ఆలయంలో వార్శిక బ్రహ్మోత్సవా లు, అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వర కు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వీరితోపాటు ఆలయ అర్చకులు కృష్ణమూర్తిశర్మ, జానకిరామశర్మ తదితరులున్నారు.
ఫిర్యాదుల స్వీకరణ
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఏఎస్పీ శంకర్ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏఎస్పీ తెలిపారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
అలంపూర్: రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఐ రవిబాబు అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసుశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 44వ జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందజేసి భద్రతను ప్రోత్సహించారు. కార్లు, లారీలు, ఆటోలు వంటి వాహనాలకు రాత్రివేళ స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎన్‌హెచ్‌ఏఐలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రిఫ్లేక్టివ్ సేఫ్టీ జాకెట్లు అందజేశారు. వాహనదారులకు గులాబీ పువ్వులు అందించి.. నిదానంగా, జాగ్రత్తగా ప్రయాణించాలని స్నేహపూర్వకంగా సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఆర్.శేఖర్, ఏఎంవీఐ పవన్‌కుమార్, రమేశ్, నేషనల్ హైవే అథారిటీ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.
జోగుళాంబ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం


