పోలీసులకు సమాచారం అందించండి
గద్వాల క్రైం: సంక్రాంతి పండగ సెలవులను పురస్కరించుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు శాఖ సూచనలు పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. ఇంట్లో ఒక్కరూ కూడా ఉండకుండా తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఇరుగు పొరుగు వారిని తెలపడంతో పాటు సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలనీలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణమే డయల్ 100 లేదా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసుశాఖ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించి దొంగతనాలను కట్టడి చేద్దామన్నారు.
సీపీఐ శతాబ్ది
ఉత్సవాలకు తరలిరండి
గద్వాల: సీపీఐ శతాబ్ది భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు కోరారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు నేపథ్యంలో పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీకి చెందిన అగ్రనాయకులతో పాటు, 40 దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రంగన్న, ఆశన్న, కృష్ణ, పరమేష్, ప్రవీణ్, రాజు, వెంకట్రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.
బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్‌ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయు డు, పల్లవి, శివలీల, నర్మద పాల్గొన్నారు.
పోలీసులకు సమాచారం అందించండి


