క్రీడాస్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు
గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురారి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కబీర్‌దాస్ అనిత నర్సింహులు సహకారంతో డీటీడీసీ యూత్ నిర్వహించిన తెలుగుపేట ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా పెట్టుకొని ఆడాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక దృఢత్వం లభిస్తుందన్నారు. గెలుపోటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమన్నారు. పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అనిత, నాయకులు నర్సింహులు, తాయన్న, కిట్టు, వెంకట్రాములు, దేవన్న, చిన్న తదితరులు పాల్గొన్నారు.


