రిజర్వేషన్లపై ఉత్కంఠ
కాంగ్రెస్‌లో బీఫాం లొల్లి..
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జోరుగా చర్చ
● టికెట్ల కోసం ఆశావహుల ముమ్మర
ప్రయత్నాలు
● వార్డులకు ఐదారుగురు పేర్లు
పరిశీలిస్తున్న పార్టీలు
● జనరల్ స్థానాలపై సీనియర్ నేతల ప్రత్యేక దృష్టి
● జిల్లాలోని నాలుగు పురపాలికల్లో
రాజకీయ సందడి
గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ఓటరు ముసాయిదా జాబితాపై స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించే ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ నెల 12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతోపాటు 16న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డులోని పోలింగ్ కేంద్రాల్లో విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు మున్సిపల్ శాఖ శ్రీకారం చుడుతుంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. రిజర్వేషన్లు ఖరారుకాక ముందే ఆశావహులు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లిలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల్లో చాలామంది పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. తాజా మాజీ కౌన్సిలర్లు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న చోటామోటా నాయకులు పోటీకి సై అంటున్నారు. ఓటర్ల జాబితా, వార్డుల వారిగా కులగణనకు సంబంధించి లెక్కలు అనధికారికంగా విడుదల కావడంతో ఆ దిశగా రిజర్వేషన్లపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. టికెట్ల కోసం ఆయా పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గద్వాల పట్టణ కాంగ్రెస్‌లో బీఫారం లొల్లి నెలకొంది. ఏడాదిన్నరగా గద్వాల కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో నడుస్తోంది. ఎమ్మెల్యే వర్గం, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం ఎవరికివారు పోటీ చేసి ఇరువురు అభ్యర్థులు సత్తాచాటారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే దూకుడు కనిపిస్తుంది. అయితే పార్టీ పరంగా ఎన్నికలు కావడంతో పార్టీ బీఫాం అభ్యర్థులకు కీలకంగా మారనుంది. రెండు వర్గాలలో ఎవరికి పార్టీ బీఫాంలు దక్కుతాయోననే చర్చ అందరిలో నెలకొంది. ఎమ్మెల్యే వర్గానికే అన్ని బీఫాంలు వస్తాయని అంచనా వేసుకుని ఆ వర్గంలోని నాయకులు అన్ని వార్డులలో పోటీకి సై అంటున్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గానికి సగం వార్డులో పోటీ చేయడానికి పార్టీ బీఫాం ఇస్తారనే చర్చ సైతం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయా వర్గాలలో పార్టీ బీఫాం రాని అభ్యర్థులకు బీఆర్‌ఎస్ నాయకులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పార్టీ బీఫాం రాని అభ్యర్థులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ బీఫాం రాకుంటే రెబల్‌గా పోటీ చేయడమా.. లేదా పార్టీ ఫిరాయించడమా అనే దానిపై అందరి ముఖ్యులతో మంతనాలు చేస్తున్నారు.


