జిల్లాకు ఈ నెల 19న మంత్రుల రాక
● పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
● రెండో విడత డబుల్ ఇళ్ల పంపిణీ
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల: జిల్లాలో పలు అభివృద్ధి పనులు, నూతన భవనాలను ప్రారంభించేందుకు ఈ నెల 19 న రాష్ట్ర మంత్రులు జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి నర్సింగ్‌కాలేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, మహిళా సమాఖ్య భవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు నర్సింగ్ కాలేజీ మంజూరై నాల్గో సంవత్సరం తరగతులు ప్రైవేటు భవనంలో కొనసాగుతున్నాయని, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకే కేంద్రం నుంచి సంబంధిత అధికారులు గద్వాలకు వచ్చిస్థలాన్ని సైతం పరిశీలించారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ వేణుగోపాల్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ హనుమంతమ్మ పాల్గొన్నారు.


