అందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం
గద్వాల: అందరికీ ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా వీబీజీ రామ్ జీ బిల్లును తీసుకొచ్చినట్లు ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీకి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ఎలాంటి బంధం లేదని, కేవలం వారు గాంధీ అని పేరు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. గతంలో మాదిరి నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం పథకంలో మార్పులు తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా వంద రోజుల పని దినాల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ పనులు జరిగే సమయాల్లో కూలీల కొరత లేకుండా 60 రోజులు హాలీడే వెసులుబాటును కల్పించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరుకు గుండె లాంటి జూరాల ప్రాజెక్టు నిర్వహణను గత, ప్రస్తుత ప్రభుత్వాలు గాలి కొదిలేశాయని, దీంతో ప్రాజెక్టు ఆయుషు తగ్గుతుందన్నారు. ప్రాజెక్టు రక్షణ కోసం నిర్మించాల్సిన బ్రిడ్జిని ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిగా మార్చడం సరైంది కాదని, దీనివల్ల జూరాల డ్యాం కు ప్రమాదం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, మిర్జాపురం వెంకటేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు.


