‘తాగునీటి సమస్య రానివ్వొద్దు’
గద్వాల: జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జలజీవన్ మిషన్, జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ కమిటీ సమన్వయ సమావేశంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని నివారించే పథకాలు జలజీవన్ మిషన్, హర్‌ఘర్ జల్ వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 3వ వారంలోగా ప్రతి మండలంలో ఎంపిక చేసిన రెండు గ్రామ పంచాయతీల్లో విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన పూర్తి తాగునీటి సమాచారాన్ని ఈ–పంచాయతీ డాష్‌బోర్డులో జనవరి 26లోగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడ తాగునీటి సమస్యలు లేనప్పట్టికీ సరఫరాలో ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులను అప్పటికప్పుడు పరిష్కరించేలా ముందస్తు ప్రణాళిక తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ కారణాలతో 39 ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సరఫరా నిలిచిందని, వెంటనే సమస్య పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ డీసీఈఓ నాగేంద్రం, మిషన్‌భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈలు శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి, డీఈ కృష్ణ, ఆయా మండలాల ఏఈలు పాల్గొన్నారు.


