క్రీడలతో శారీరక దృఢత్వం
● బీచుపల్లి పదో బెటాలియన్
సిబ్బంది సేవలు విలువైనవి
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల టౌన్/ఎర్రవల్లి: శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్ పోలీస్ సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వివిధ కంపెనీల బెటాలియన్ సిబ్బంది కవాతును కలెక్టర్ తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరకంగా దృఢంగా ఉండటం ప్రధానమని పేర్కొన్నారు. ఏటా నిర్వహించే క్రీడల పోటీల సందర్బంగా కాకుండా ప్రతినిత్యం ఇక్కడ పోలీస్ సిబ్బంది వ్యాయామం, వివిధ క్రీడల్లో సాధన చేస్తూ ఫిట్‌గా ఉండాలని సూచించారు. విజేతలుగా ఎవరు నిలిచినప్పటికీ పోటీల్లో పాల్గొనడం, క్రీడాస్పూర్తితో ఆడటం ముఖ్యమని తెలియజేశారు. బెటాలియన్ అతిధి గృహం విస్తరణకు కలెక్టర్ నిధుల నుంచి రూ.10లక్షలు ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులోనూ తన వంతుగా సహకారం అందిస్తామనన్నారు. ఎన్నికల నిర్వహణకు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు, బందోబస్తు సమయంలో బెటాలియన్ పోలీసుల సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.
మూడు దశాబ్దాలుగా సేవలు :
కమాండెంట్ జయరాజు
1995లో ప్రారంభమైన పదో బెటాలియన్ సుమారు మూడు దశాబ్దాల పాటు రాష్ట్రంలో బందోబస్తు, నక్సలిజం నిర్మూలన, పరేడ్స్, తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తుందని కమాండెంట్ జయరాజు అన్నారు. ప్రతి ఏటా సిబ్బందిలో స్నేహభావం పెంచడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంచడం కోసం వార్షిక క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందికి కలెక్టర్ పతకాలు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. కలెక్టర్‌కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, నరేందర్‌రెడ్డి, ఏఓ తాజుద్దీన్, సంక్షేమ అధికారి నర్సింహరాజు, ఇతర అధికారు పాల్గొన్నారు.
అంధులు అత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
అంధులు తమ లోపాన్ని అధికమించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంధుల ఆశ్రమ పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ అంధత్వాన్ని శాపంగా భావించకుండా, లూయీస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని రాణించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంధులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. యుడీఐడీ కార్డుల మంజూరు చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల మున్సిపల్ వార్డు ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించిన పాఠశాల పూర్వ విద్యార్థి శివకుమార్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో ఉన్న లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అఽధికారిణి సునంద, డీఈఓ విజయలక్ష్మి, పాఠశాల కార్యదర్శి రంగన్న తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక దృఢత్వం


