చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తాం
గద్వాల/అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం చేనేత రంగంలో టెక్నాలజీ అనుకూలంగా ఎన్నో రకాల పరికరాలు వచ్చాయని, వాటికి అనుకూలంగా కార్మికులు చీరలను తయారు చేయాలని సూచించారు. అక్రమ వ్యాపారానికి అలవాటుపడ్డ కొందరు గద్వాల పేరు ప్రతిష్టను గద్వాల పేరుమీదుగా చీరలు తయారు చేసి డబ్బు వెనకేసుకుంటున్నట్లు, దీనివల్ల నిజమైన గద్వాల చేనేత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన గద్వాల, గట్టు చేనేత కార్మికులకు ఎన్‌హెచ్‌డీపీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ క్లస్టర్ అభివృద్ధి పథకం కింద కార్మికులకు పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామలింగేశ్వర్, అక్కల శ్రీనివాసులు, మంత్రి సురేష్, జంబు రామన్‌గౌడ్, విజయ్, రాజశేఖర్, శ్రీనివాసులు మురళి, నాగిరెడ్డి, శ్రీను, షుకూరు, అన్వర్, భాస్కర్, మొబిన్, సంగాల నర్సింహులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్, రాజోళిలో..
రాజోళి రైతువేదికలో రాజోళి, అలంపూర్ క్లస్టర్లలోని చేనేత కార్మికులకు చేనేత లిఫ్టింగ్ యంత్రాలు ఎమ్మెల్యే విజయుడు అందించారు. మొత్తం 407 మంది చేనేత కార్మికులకు సబ్సిడీపై పరికరాలు అందించారు. చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అర్హులందరికీ సబ్సిడీపై పరికరాలు అందజేస్తామని, నియోజకవర్గంలో 800 మంది కార్మికులకు మిషన్లు అందనున్నట్లు చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య అన్నారు. ప్రస్తుతం 407 మంది కార్మికులకు అందిస్తున్నట్లు తెలిపారు. లిఫ్టింగ్ మిషన్‌తో చేనేత కార్మికులు బరువైన జాక్వార్డులను కాళ్లతో తొక్కాల్సిన పని ఉండదన్నారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర, క్లస్టర్ సీడీఈలు శివమణి, సాకేత్, చేనేత సహకార సంఘం ఇన్‌చార్జి పరన్స్ తదితరులు పాల్గొన్నారు.


