పశుసంపదతోనే వ్యవసాయాభివృద్ధి
గద్వాల వ్యవసాయం: పశుసంపద సమృద్ధిగా ఉంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి జిల్లా పశుగణాభివృధ్ది సంస్థ అధికారి మధుసూదన్‌గౌడ్ అన్నారు. బుధవారం గద్వాల మండలం బీరెల్లీ గ్రామంలో పశుగణాభివృధి సంస్థ, జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంపద వల్ల రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని, చూడి కట్టని, సకాలంలో ఎదకు రాని పశువులకు సరైన వైద్యం అందించాలని రైతులకు సూచించారు. పశుగణాభివృధ్ది సంస్థ ఆద్వర్యంలో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి శివానంద్ మాట్లాడుతూ.. పాల దిగుబడి పెంపునకు పాడి రైతులు నిత్యం సరైన పోషణ అందించాలని సూచించారు. సరిపడా పచ్చిమేత, ధాన్యపు జాతి జొన్న, మొక్కజొన్న గడ్డి రకాలు, కాయ జాతి అలసందలు, బలమైన దినుసులతో సమీకృత దాణ, లవణ మిశ్రమాన్ని తయారు చేసి పశువులకు అందించాలన్నారు. చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలన్నారు. రాయితీపై గడ్డి విత్తనాలు అందిస్తామని తెలిపారు. శిబిరంలో భాగంగా 12 ఆవులు, 33 గేదెలకు గర్భకోశ పరీక్షలు, 15 పశువులకు సాధారణ చికిత్సలు నిర్వహించి, మందులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత రాధాకృష్ణారెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ రమేష్‌నాయుడు, యుఆర్ రమేష్, వెంకటేశ్వర్లు, అర్పిత, శంకరయ్య, వెంకట్‌రాజు, ప్రియాంక, నవీన్‌చంద్ర పాల్గొన్నారు.


