అర్హులకు సబ్సిడీపై చేనేత యంత్రాలు
అలంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన చేనేత కార్మికులకు చేనేత లిఫ్టింగ్ యంత్రాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. రాజోళి మండల కేంద్రంలోని రైతువేదికలో రాజోళి, అలంపూర్ క్లస్టర్లలోని చేనేత కార్మికులకు చేనేత సబ్సిడీ పనిముట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ చేనేత అభివృద్ధి పథకం ద్వారా అలంపూర్, రాజోలి క్లస్టర్లలో చేనేత కార్మికులకు సబ్సిడీ పనిముట్లను ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. క్లస్టర్–1లో 212 మందికి, క్లస్టర్– 2లో 195 మందికి మొత్తం 407 మంది చేనేత కార్మికులకు సబ్సిడీ పనిముట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేనేత కార్మికులు ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్న రుణమాఫీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య మాట్లాడుతూ.. అర్హులందరికీ సబ్సిడీ పనిముట్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 800 మంది కార్మికులకు మిషన్లు అందనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 407 మంది కార్మికులకు సబ్సిడీ మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. లిఫ్టింగ్ మిషన్‌తో చేనేత కార్మికులు బరువైన జాక్వార్డులను కాళ్లతో తొక్కాల్సిన పని ఉండదన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు 50 శాతం వచ్చిట్లు తెలిపారు. చేనేత భరోసా పథకం ఈ నెలలో అమలవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఓ ఉపేంద్ర, క్లస్టర్ సీడీఈలు శివమణి, సాకేత్, చేనేత సహకార సంఘం ఇన్‌చార్జి పరన్స్ తదితరులు పాల్గొన్నారు.


