పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పన
గద్వాల: మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా.. తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో 2025 డిసెంబర్ 1 నాటి ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి.. పూర్తి పారదర్శకతతో తుది జాబితాను రూపొందిస్తామన్నారు. ఒటరు జాబితా సమరణలో భాగంగా ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
భూ సమస్యలను పరిష్కరించాలి
కేటీదొడ్డి: భూ సమస్యలపై అందిన దరఖాస్తులపై క్షేత్రస్ధాయిలో సమగ్రంగా విచారించి పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. కేటీదొడ్డి మండలం పాగుంట శివారులోని 103 సర్వే నంబర్‌లో భూ భారతి కింద పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని.. సమస్య పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్న స్ధానిక రైతులను కలెక్టర్ స్వయంగా కలుసుకొని సమస్యలను తెలుసుకున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి సరిగ్గా లేకపోయినా బైక్‌పై వెళ్లి క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంబంధిత భూముల పూర్వ రికార్డులు, సర్వే వివరాలు, డాక్యుమెంట్లను సమగ్రంగా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కేటీదొడ్డిలోని 67 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తులో ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లను క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశారు. అదే విధంగా పాగుంట ప్రాధమికోన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. విద్యార్థుల హాజరు, బోధనా విధానం, సౌకర్యాలు తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూ చించారు. అనంతరం పింఛన్ల పంపిణీని పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, తహసీల్దార్ హరికృష్ణ, హెచ్‌ఎం రవి ఉన్నారు.


