తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
అలంపూర్: ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయరాజు అన్నారు. మంగళవారం అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బోటనీ ల్యాబ్‌ను పరిశీలించారు. ల్యాబ్ సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధ్యాపకుడికి ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు మనిషి జీవితంలో విలువ పెంచుతుందన్నారు. విద్యార్థులు కొత్త సంవత్సరంలో పాత అలవాట్లకు స్వస్తి పలికి.. భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును అశ్రద్ధ చేయొద్దన్నారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.
స్వీపర్ల వేతనాలు విడుదల చేయాలి
గద్వాల: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్‌లో ఉన్న మూడు నెలలు వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉప్పేరు నర్సింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీపర్ల వేతనాలకు సంబంధించిన నిధులు మంజూరైనప్పటికీ.. వారి ఖాతాల్లో జమ చేయడం లేదని తెలిపారు. ఇప్పటికై నా స్వీపర్లకు పెండింగ్ వేతనాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రఘు, మురళి, మల్లమ్మ పాల్గొన్నారు.
వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి
ఎర్రవల్లి: పశువులకు సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.శివానందస్వామి అన్నారు. మంగళవారం మండలంలోని రాజశ్రీ గార్లపాడులో పశువైద్య శిబిరం ఏర్పాటుచేసి.. ఎదకు రాని పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భకోశ వ్యాధుల నివారణ కోసం టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే సకాలంలో ఎదకు వచ్చి చూడి కడతాయన్నారు. దీనివల్ల పాడి రైతులు ప్రతి ఏటా ఒక దూడను పొంది ఆర్థికంగా లాభం పొందుతారని సూచించారు. అనంతరం చికిత్స అందించిన 11 గేదెలు, 6 ఆవుల పెంపకందారులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశువైద్యులు భువనేశ్వరి, వినయ్, సర్పంచ్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు.
తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి


