అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం : కమిషనర్
● గెజిట్ ప్రకారమే జాబితా విడుదల చేశామని కమిషనర్ స్పష్టం
● కలెక్టర్‌ను ఆశ్రయించిన నాయకులు
గద్వాలటౌన్: మున్సిపాలిటీలకి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయ దుమారం చెలరేగుతోంది. గద్వాల మున్సిపాలిటీలలో చేసిన వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులతో పాటు ప్రతి పక్ష పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అధికారుల ఊదాసీనత, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
లోపాలపై నాయకుల ఆగ్రహం
గద్వాల మున్సిపాలిటీలో ఓటరు ముసాయిదా జాబితాలో లోపాలు ఉన్నాయని వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ హాల్‌లో వివిధ రాజకీయ పక్షాలతో కమిషనర్ జానకీరామ్ సాగర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల తీరును అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఎండగట్టారు. ముసాయిదా జాబితా అస్తవ్యస్తంగా ఉందని, కొన్ని వార్డులలో ఓటర్లను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. పక్కనున్న ఇళ్లను అదే వార్డులో కాకుండా దూరంగా ఉన్న మరో వార్డులో కలపడం పట్ల ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు కమిషనర్ దృష్టికి తెచ్చారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
వార్డుల వారీ ఓటరు ముసాయిదా జాబితా మొత్తం అశాసీ్త్రయంగా, అసంబద్ధంగా ఉందని వివిధ రాజకీయ పక్షాల నాయకులు మిర్శించారు. మున్సిపాలిటీలో జరిగిన సమావేశం అనంతరం ఆయా రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా కలెక్టర్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఓటర్ ముసాయిదాపై అభ్యంతరాలను బీజేపీ నాయకులు వివరించారు. అధికార కాంగ్రెస్‌లోని ఓ వర్గం నాయకులు ముసాయిదా జాబితాపై తమకూ కొన్ని అభ్యంతాలున్నాయని చెబుతుండడం విశేషం. పార్టీల ఆరోపణల మాటలు ఎలా ఉన్నా.. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో స్పష్టత కనిపించడం లేదు. గెజిట్ ప్రకారమే జాబితా విడుదల చేశామని చెప్పి చేతులు దులిపేసుకున్నారే తప్ప.. ఆ జాబితా లోపల ఉన్న ఇళ్ల నంబర్లు, కనీసం కాలనీల వివరాలు గానీ స్పష్టంగా చెప్పలేదు. రెండు, మూడు నెలల పాటు శాసీ్త్రయంగా చేయాల్సిన ఓటర్ల ప్రక్రియను కేవలం రెండు రోజుల్లో పూర్తి చేశారనే విమర్శలు ఉన్నాయి. చాలా వార్డులలో భౌగోళిక స్వరూపం కొరవడిందని మండిపడుతున్నారు. 7, 16, 17, 30వ వార్డుల పరిధిలో చేరిన ఇతర వార్డు ఓట్లను చేర్చడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఆయా వార్డుల నాయకులు ఫిర్యాదు చేశారు.
ఇది ఓటరు ముసాయిదా జాబితా మాత్రమే అని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ముసాయిదా జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 17 ఫిర్యాదులు అందయని చెప్పారు. వాటి సాధ్యసాధ్యాలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆయా రాజకీయల పార్టీల నాయకులు రాజీవ్‌రెడ్డి, భీంసేన్‌రావు, రామాంజనేయులు, సుభాన్, ఆంజనేయులు, ఉప్పేర్ నర్సింహా, త్యాగరాజు, మోహన్‌రావు, కోటేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


