వైద్య విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అలంపూర్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీహెచ్‌ఎస్ రమేష్ చంద్ర అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిని ఆయనతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్‌బాష సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ రమేష్ చంద్ర మాట్లాడుతూ.. ఆస్పత్రికి వైద్యులు సకాలంలో హాజరు కావాలని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి రోజు మొబైల్ యాప్‌లో హాజరు నమోదు తప్పనిసరిగా ఉండాలని, ముందస్తు సమాచారంతోనే విధులకు సెలవులో వెళ్లాలన్నారు. సమాచారం లేకుండా విధుల్లో గైర్హాజరైతే శాఖపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఆస్పత్రికి త్వరలోనే వామర్లు, ఫోటోథెరపీ సామగ్రి వస్తాయని తెలిపారు. ఆర్‌ఓ ప్లాంట్ సైతం అబదుబాటులోకి రానున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు రూపాలి, అమీర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,900
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు సోమవారం 368 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.8900, కనిష్టం రూ.4590, సరాసరి రూ.8590 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.6060, కనిష్టం రూ.5355, సరాసరి రూ.6060 ధరలు పలికాయి. 234 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టం రూ.7049, కనిష్టం రూ. 2323, సరాసరి రూ. 7029... 15 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2562, కనిష్టం రూ. 2326, సరాసరి రూ. 2326 ధరలు లభించాయి.
616 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలికల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. మిగిలిన 18 మున్సిపాలిటీలో మొత్తం 316 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు మొత్తంగా 616 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా సోమవారం ఆయా పురిపాలికల పరిధిలో అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పలు అభ్యంతరాలు చెబుతూ.. పరిష్కరించాలని విన్నవించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్ల పరిధిలో 144 ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. దేవరకద్రలో 9, నాగర్‌కర్నూల్‌లో 121, కొల్లాపూర్‌లో 8, కల్వకుర్తిలో 36, నారాయణపేటలో 4, మక్తల్ 10, కోస్గిలో 5, మద్దూరులో 16, గద్వాలో 17, అయిజలో 22, వడ్డేపల్లిలో 36, వనపర్తిలో 8, కొత్తకోటలో 6చ అమరచింత 4, ఆమ్మకూర్‌లో 11, పెబ్బేరులో 71 ఫిర్యాదులు రాగా.. అలంపూర్ మన్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.


