వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల విగ్రహాలను అపురూపంగా ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. ఇదిలాఉండగా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు. భక్తులకు గోపల్‌దిన్నెకు చెందిన రంగస్వామి, జానకి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


