కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
ఆదిశిలావాసుడి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు వేదపండితులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, శశాంక్ ప్రత్యేక పూజలు నిర్వహించి భాజాభజంత్రీలు, మేళతాళాలతో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం మహాహోమం నిర్వహించి స్వామి వారి కల్యాళణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా, శనివారం కావడంతో ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


