వేరుశనగ క్వింటా రూ.7,602
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 439 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7602, కనిష్టం రూ.4276, సరాసరి రూ.6399 ధరలు లభించాయి. అలాగే, 16 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 2309 ధర పలికింది. 28 క్వింటాళ్ల కంది రాగా, గరిష్టం రూ. 6630, కనిష్టం రూ. 2209, సరాసరి రూ. 6489 ధరలు వచ్చాయి.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీల శిక్షణకు క్రీడాకారులు
గద్వాలటౌన్: ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విజయవాడలో జరిగే జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల శిక్షణ క్యాంపునకు గద్వాలకు చెందిన క్రీడాకారులు అజిత్, మహేష్ ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డీకే స్నిగ్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. ఈ నెల 5వ తేది నుంచి 7వ తేదీ వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరపున అజిత్, మహేష్ పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలలో మన జిల్లా క్రీడాకారులు అజిత్, మహేష్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీల శిక్షణా శిబిరాన్నికి ఎంపిక చేశారు. వీరు రెండు వారాల పాటు హైదరాబాద్‌లో జరిగే శిక్షణలో పాల్గొననున్నారు. వీరు ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మానవపాడు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండలంలోని కేజీబీవీ, మండల పరిషత్ పాఠశాలలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, కేజీబీవీ భవన నిర్మాణం నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించి విద్యార్థుల సమర్థ్యాలను మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ శివప్రసాదు, ఎస్‌ఓచ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
రేపు బీచుపల్లిలో
సీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని ఆయన కోరారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ
స్తంభాల తరలింపు
రాజోళి: మండలంలోని పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీపై జరిగిన రగడ తెలిసిందే. ఫ్యాక్టరీ నిర్మించవద్దని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కొద్ది రోజుల ఫ్యాక్టరీ విషయం తెరపైకి రాకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఫ్యాక్టరీ యాజమాన్యం తమ నిర్ణయం మార్చుకుందని, ఏపీకి తరలి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తున్నట్లుగా శుక్రవారం ఫ్యాక్టరీకి సంబందించిన విద్యుత్ స్తంభాలను అక్కడి నుండి తరలించారు. క్రేన్ల సహాయంతో ట్రాక్టర్లపైకి ఎత్తి అక్క డి నుండి తరలించడంతో చుట్టు పక్కల గ్రా మాల వారు కూడా ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించడం లేదని భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,602
వేరుశనగ క్వింటా రూ.7,602


