అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు
గద్వాలటౌన్: అందరి సహకారంతో జిల్లాకు గుర్తింపు వచ్చిందని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే స్ఫూర్తితో 2026లో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల నాయకులు వీరభద్రప్ప, కరుణాకర్, అజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ...
యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని, విద్యా అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంకితభావంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని, పదిలో మంచి ఫలితాలు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు కుమార్‌నాయుడు, వెంకటరమణ, బీసన్న, తిమ్మప్ప, రాజశేఖర్, చంద్రకాంత్, రాముడు తదితరులు పాల్గొన్నారు.


