ఆనందోత్సాహాలతో స్వాగతం
● కేక్‌లు కట్ చేసి సంబరాలు
● అర్ధరాత్రి వీధుల్లో యువత నృత్యాలు
గద్వాలటౌన్: కొత్త ఆశలు.. ఆశయాలు, ఆలోచనలు.. కొత్త లక్ష్యాలు.. గమ్యాలు.. కోటి కాంతులతో నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. జిల్లా ప్రజలు బుధవారం రాత్రి నుంచి గురువారం అంతా సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. కేరింతలతో ‘విష్‌యు హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇళ్ల ముంగిట రంగుల హరివిల్లులుగా రంగవళ్లికలను అలంకరించారు. ఇళ్లు, యువజన సంఘాలు, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని పట్టణ శివారు ప్రాంతాల్లో యువకులు మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయా ఏర్పాట్లులో యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి చిందులేస్తూ నృత్యాలు చేశారు.
కిక్కిరిసిన ఆలయాలు
నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ భక్తులు వేడుకున్నారు. గురువారం పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. నూతన సంవత్సర వేడుకలతో తెల్లవారుజామునుంచే పట్టణంలోని ఆలయాలు కిటకిటలాడాయి. విశేషపూజలు, ఆరాధనలు, అభిషేకాలు, పారాయణాలు జరిపారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి, రాఘవేంద్రస్వామిమఠం, కృష్ణమందిరం, సాయిబాబ ఆలయం, కన్యకాపరమేశ్వరి, సంతాన వేణుగోపాలస్వామి, అయ్యప్పస్వామి, నల్లకుంట శివాలయం తదితర ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. అయ్యప్ప పడిపూజలు, పల్లకి సేవలతో భక్తులు పరవశించిపోయ్యారు. కొత్త సంవత్సరంలో విజయం చేకూర్చాలని కోరుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకున్నారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
కోటి ఆశలతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రైస్తవులు ప్రభువును ప్రార్థించారు. గురువారం ఉదయం పట్టణంలోని పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎంబీ మిస్పా చర్చిలో సండే స్కూల్ విద్యార్థులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చర్చిలలో పాస్టర్లు శాంతి సందేశాలను బోధించారు.
ఆనందోత్సాహాలతో స్వాగతం


