కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
గద్వాల: ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల వసతులను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ బాలుర వసతిగృహం, ఆనందనిలయాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకొన్నారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. మీరు చాలా దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదిలి ఒక్కడికి వచ్చి చదువుకుంటున్నారని, మీఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని రకాల వసతి, నాణ్యమైన భోజనం, విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రతిఒక్కరు కూడాసద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చి ఐఏఎస్ సాధించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారని విద్యార్థులకు వివరించారు. ఏదైన సాధించాలంటే గొప్ప కలలు కనాలని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో నిరంతరం కష్టపడి చదువుకోవాలని తద్వారా నిర్ధేశించుకున్న గొప్ప కలలు సాకారమవుతాయని సూచించారు. అదేవిధంగా విద్యతో పాటు ప్రతిఒక్కరు శారీరక ఆరోగ్యం కూడ ముఖ్యమని ఇందుకోసం ప్రతిరోజూ విద్యార్థులందరూ వ్యాయమం చేయాలని సూచించారు. సాల్కర్‌షిప్ నమోదులో రాష్ట్రంలో మన జిల్లా 5వ స్థానంలో నిలిచిందన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అక్బర్‌పాషా, వార్డెన్లు శ్రీను, మధు, రామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.


