నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
గద్వాలటౌన్: జాబ్ క్యాలెండర్ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వపల్లయ్య విమర్శించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరానికి కొత్త క్యాలెండర్లు మారుతున్నాయని, జాబ్ క్యాలెండర్ మాత్రం అమలు కావడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ పాలన రెండేళ్లు పూర్తయిన ఇప్పటి వరరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో మెగా డీఎస్పీ ద్వారా 25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి సీఎం మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవటం సిగ్గు చేటన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు మహేష్, చక్రవర్తి, మాధవ్, గోపాల్, కాశీం, పటేల్, నర్సింహా, రాము, కిరణ్, అభిషేక్, గోవిందు, చక్రి, జహంగీర్, శీనునాయక్ పాల్గొన్నారు.


