కొలువే లక్ష్యంగా..
లెక్చరర్ అవుతా
విద్యతోనే భవిష్యత్
ఉచితంగా వైద్యం చేస్తా
సీఏ కావడమే లక్ష్యం
ఎవరి మీద ఆధారపడకుండా
ఉద్యోగం సాధిస్తా
తల్లిదండ్రుల కల నెరవేరుస్తా
జీవితంలో స్థిరపడాలని
తల్లిదండ్రులకు అండగా..
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం
● ప్రభుత్వ ఉద్యోగం, సమాజసేవ, ఉన్నత స్థానాల వైపు అడుగులు
● జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల
కల నెరవేరుస్తాం..
● జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి
డిగ్రీ, పీజీ (ఆర్ట్స్ అండ్ సైన్స్) కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో
నూతన సంవత్సరంలో యువత ప్రణాళికలు
గద్వాల: ఉపాధ్యాయుడు.. లెక్చరర్.. డాక్టర్.. ఇంజినీర్.. సైంటిస్ట్.. ఇలా కొలువే లక్ష్యంగా.. జీవితంలో స్థిరపడేలా యువత అడుగులు వేస్తున్నారు. లక్ష్యాలు చేరుకోవాలంటే చదువే మార్గమని.. ప్రతి ఒక్కరి జీవితంలో కళాశాల విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని.. కష్టపడి చదివితే లక్ష్యాలు చేరుకోవడం సులువని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని తమ కుటుంబాలకు అండగా నిలబడడమే కాకుండా ఉత్తమ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరంలో జీవితానికి సంబంధించి స్థిరపడేలా పలు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునే ప్రణాళికలతో సిద్ధమయ్యారు. గద్వాల పట్టణంలోని శ్రీసత్యసాయి డిగ్రీ, పీజీ కాలేజీ (ఆర్ట్స్‌అండ్ సైన్స్) విద్యార్థులతో బుధవారం ‘సాక్షి’ టాక్‌షోను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలు, వాటిని సాధించుకునేందుకు వేసుకున్న ప్రఽణాళికలను పంచుకున్నారు.
శ్రీసత్యసాయి డిగ్రీ, అండ్ పీజీ కళాశాల విద్యార్థులు
బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పీజీ పూర్తి చేసిన తర్వాత లెక్చరర్ కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నాను. దాని కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీలో గురువుల సహకారంతో నేను అనుకున్న లక్ష్యం సాధిస్తాననే నమ్మకం పెరిగింది. పీజీ సాధించేందుకు అవసరమైన మెటీరియల్‌ను ఇప్పటి నుంచే సేకరిస్తున్నాను. పీజీ సాధించి ఖచ్చితంగా లెక్చరర్‌ను అవుతాను.
– రాజేశ్వరి, బీఎస్సీ(బీజెడ్సీ) ఫైనల్ ఇయర్
చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెబుతూ మా నాన్న, అమ్మలు నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో నాకు చదువు పట్ల ఇష్టం పెరిగింది. బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన కోరిక ఏర్పడింది. డిగ్రీ తరువాత బీఈడీ, పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా ఇప్పటి నుంచే లక్ష్యం పెట్టుకున్నాను.
– శృతి, బీఎస్సీ(ఎంపీసీఎస్) ఫస్టియర్
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని బలమైన సంకల్పం ఉంది. ముఖ్యంగా పేదలకు వైద్యం అందించి తనవంతుగా సమాజసేవలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. ఇందుకోసం మా తల్లిదండ్రులు, కాలేజీలో లెక్చరర్లు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు.
– శృతి, ఇంటర్మీడియట్
నేను బీకాం చదువుతున్నాను. అనంతరం చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నదే లక్ష్యం. ఇందుకోసం తనకు ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారంతో పాటు మాకా లేజీ లెక్చరర్లు అన్ని విధాలా సలహాలు, సూచనలు ఇస్తూ సహకారం అందిస్తున్నారు. నూతన సంవత్సరంలో సీఏ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
– అమీజ్, బీకాం
చదువు పూర్తి చేసుకుని ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. వచ్చిన డబ్బుతో తనవంతుగా సమాజం కోసం ఏదైన మంచి పనులు చేయాలని ఉంది.
– బుడ్డన్న, ఎంఎల్‌టీ
ల్యాబ్‌టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ పరంగా కాని, ప్రైవేటులో ఉద్యోగం సాధించాలని నూతన సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్నాను.
– శివకుమార్, ఎంఎల్‌టీ
నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుదాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే నా తల్లిదండ్రుల కల. చిన్నతనం నుంచి చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తా.
– కె.కావ్య బీఎస్సీ (బీజెడ్సీ)
జీవితంలో త్వరగా స్థిరపడాలని నా తల్లిదండ్రులు నన్ను ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేర్పించారు. ల్యాబ్‌టెక్నీషియన్ కోర్సు పూర్తి త్వరగా ఉద్యోగంలో స్థిరపడి తమ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాను. ఈ నూతన సంవత్సరంలో ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను.
– నరేష్, ఎంఎల్‌టీ
చదువు పూర్తి చేసి త్వరగా ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా నిలబడతాను. వారి బాగోగులు చూసుకుంటూ ముందుకు సాగాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. – ఈశ్వర్, ఎంఎల్‌టీ
ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే లక్ష్యం. ఉద్యోగం అనంతరం అమ్మ, నాన్నలను బాగా చూసుకుంటాను.
– ఇమ్రాన్, ఎంఎల్‌టీ


