పురపోరు.. కసరత్తు జోరు
ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం
2 మినహా మిగిలిన 19
మున్సిపాలిటీల్లో..
నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల..
● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు
● అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం
● మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి
● ఓటర్ల జాబితా సైతం..
నేడు ముసాయిదా విడుదల
● రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు.
తొలిసారిగా కార్పొరేషన్‌లో..
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్‌గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు.
కొత్తగా దేవరకద్ర.. మద్దూరు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన రోజే మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్‌లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
పురపోరు.. కసరత్తు జోరు


