మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
గద్వాల: మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే సంబంధిత అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల పరిఽధిలోని వార్డుల వారిగా ఓటర్ల లిస్టు ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసేందుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు, మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలన్నారు. ఒక్కో వార్డులో 850 పైగా ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లు, ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది స్థానికులు కాకుండా ఇతర మండలాల వారిని నియమించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వందశాతం పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి జనవరి 6వ తేదీలోపు అన్ని అనుమతులు పూర్తిచేసి మార్కౌట్ చేసి పునాదులు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలలో వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరీ అయినట్లు వీటిని సైతం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హౌసింగ్‌పీడీ శ్రీనివాస్‌రావు, జడ్పీడి.సీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమీషనర్లు డీఈ, ఏఈలు పాల్గొన్నారు.


