హుండీ ఆదాయం రూ.21.82 లక్షలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.21.82 లక్షలు వచ్చిందని దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు చేపట్టగా.. గద్వాలకు చెందిన ఎస్‌ఎల్‌వి సేవా సంఘం ఆధ్వర్యంలో 150మంది పాల్గొన్నారు. మొత్తం రూ.21,82,936 ఆదాయం, చింతలాముని నల్లారెడ్డిస్వామి ఆదాయం రూ.34,630 వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. గతేడాది కంటే అదనంగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, చైర్మన్ ప్రహ్లాదరావు, నాయకులు సీతారామిరెడ్డి, చంద్రశేఖర్‌రావు, పద్మారెడ్డి, వీరారెడ్డి, రాముడు, భీమన్న, వీరన్న ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,889
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 306 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.6889, కనిష్టం రూ.3850, సరాసరి రూ.3850 ధరలు లభించాయి. అలాగే, 21 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5869, కనిష్టం రూ.5728, సరాసరి రూ.5759 ధరలు పలికాయి. 1988 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2689, కనిష్టం రూ. 1866, సరాసరి ధరలు రూ. 2689 వచ్చాయి.
ఆయిల్‌పాం సాగుతో
దీర్ఘకాల లాభాలు
మల్దకల్: రైతులు ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాల లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ సూచించారు. శుక్రవారం మల్దకల్ రైతువేదికలో సింగిల్‌విండో డైరెక్టర్లు, రైతులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం పంట దిగుబడి వచ్చే ఆయిల్‌పాం సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలతో పాటు సాగుకు సంబంఽధించిన డ్రిప్ అందజేస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆయిల్‌పాం సాగులో రైతులు అంతరపంటను సాగు చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, ఏడీఏ శివనాగిరెడ్డి, ఏఓ రాజశేఖర్, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డితోపాటు విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సంఘటితంతోనే
సమస్యల పరిష్కారం
గద్వాలటౌన్: తెలుగు ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏ జాబితాలో చేర్చాలని, బీసీ–ఏ సాధన కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని, సంఘటితంగా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కబీర్‌దాస్ నర్సింహులు, నియోజకవర్గ అధ్యక్షుడు టీఎన్‌ఆర్ జగదీష్ సూచించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గద్వాల తెలుగు, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రెండవ రైల్వేగేటు దగ్గర ఉన్న సంఘం కమ్యూనిటీ హాల్ స్థలంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సంఘం జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం గంగమ్మతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం నదిఆగ్రహారం, గార్లపాడు గ్రామాలలో ఉన్న మత్స్య సహకార సంఘాలలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జనార్థన్, రమేష్, నంబర్ నర్సింహా, అంజి, దౌలు, లక్ష్మన్న, రాములు, దడవాయి నర్సింహులు, పాండు తదితరులు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ.21.82 లక్షలు
హుండీ ఆదాయం రూ.21.82 లక్షలు


