బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
అయిజ: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం వద్ద అంతర్రాష్ట్ర రహదారి రాయచూరు – కర్నూలు రోడ్డుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ధర్నాకు దిగారు. బస్సులు నిలపకపోడంతో పాఠశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని, చదువులకు దూరమవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు బైఠాయించడంతో రోడ్డుకు ఇరు వైపులా బస్సులు, లారీలు ఎక్కడికక్కడే నిలిచాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఆర్టీసీ సిబ్బంది అక్కడకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఎస్‌ఐ ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతకు ఫోన్‌చేసి మాట్లాడారు. బస్సులు పర్దీపురంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించడంతో వాహనాలు ముందుకు కదిలాయి. ఈ నెల 4వ తేదీన సైతం విద్యార్థులు ధర్నా చేశారు. ఈవిషయమై ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతను వివరణ కోరగా.. ఆర్టీసీ బస్సులు పర్దీపురం స్టేజీ వద్ద నిలుపుతున్నారని, అయితే ప్రత్యే క బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని, అది వీలుకాదని పేర్కొన్నారు.
అంతర్రాష్ట రహదారిపై రెండు
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు


