భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
గద్వాలటౌన్: పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భూ భారతి, మీ–సేవ దరఖాస్తులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎఫ్–లైన్ దరఖాస్తులపై మండలాల వారీగా తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్‌లో ఎన్ని ఆర్జీలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు ఆరు నెలలు దాటిన వాటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ల లాగిన్‌లలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తులలో ప్రభుత్వ భూములు లేదా కాల్వలకు సంబంధించిన అంశాలు ఉంటే సర్వేయర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని, దరఖాస్తులను తిరస్కరించే ముందు స్పష్టమైన కారణాలను తెలియాజేయాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయాలలో ఆదాయం, కుల, కుటుంబ ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి తహసీల్దార్ తమ పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలను విధిగా సందర్శించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అలివేలు, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డు రామ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.


